కశ్మీర్‌లో భారత్ బలప్రయోగాన్ని అడ్డుకునే విషయంపై ఐరాస మానవహక్కుల కమిషన్ (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో తమకు 58 దేశాల మద్దతు లభించినట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

ట్విటర్ వేదికగా గురువారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

''కశ్మీర్‌లో భారత్ బలప్రయోగం ఆపాలని, ఆంక్షలను ఎత్తివేయాలని అంతర్జాతీయ సమాజం చేస్తున్న డిమాండ్‌పై ఐరాస మానవహక్కుల కమిషన్‌లో పాకిస్తాన్‌కు మద్దతు పలికిన 58 దేశాలను అభినందిస్తున్నా. కశ్మీరీల హక్కులు పరిరక్షించాలని, ఐరాస భద్రతా మండలి తీర్మానాల ప్రకారం వివాదాన్ని పరిష్కరించుకోవాలని కూడా ఆ దేశాలు పిలుపునిచ్చాయి'' అని అర్థం వచ్చేలా ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

https://twitter.com/ImranKhanPTI/status/1172096235358085120

అయితే, ఈ ట్వీట్‌పై భారత్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఇమ్రాన్ వ్యాఖ్యల్లో నిజానిజాలపై ట్విటర్ యూజర్స్ కూడా సందేహాలు వ్యక్తం చేశారు.

ఎందుకంటే యూఎన్‌హెచ్ఆర్‌సీలో 58 దేశాలు లేవు. అందులో ఉన్న సభ్యదేశాల సంఖ్య 47 మాత్రమే.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్.. ఇమ్రాన్ ఖాన్‌ను విమర్శించారు.

ఇమ్రాన్ ట్వీట్ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు.. ''ఏ దేశాల గురించి చెబుతున్నారో మీరే ఆయన్ను అడగండి. వాటి జాబితా ఇవ్వమనండి. మా వద్దైతే అలాంటి జాబితా ఏదీ లేదు. భారత్, పాకిస్తాన్‌లతో కలిపి యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఉన్న సభ్య దేశాల సంఖ్య 47. తమ దేశంలోని మైనార్టీల గొంతునే పాకిస్తాన్ నొక్కుతోంది'' అని రవీశ్ బదులిచ్చారు.

యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో తమ ప్రతినిధి బృందం భారత్ వాణిని సమర్థంగా వినిపించిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను, చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిందని వివరించారు.

జమ్మూకశ్మీర్‌ అంశాన్ని రాజకీయం చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలన్నింటినీ అంతర్జాతీయ సమాజం తిరస్కరించిందని రవీశ్ అన్నారు.

https://twitter.com/MEAIndia/status/1171454718830247946

''ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ పోషిస్తున్న పాత్ర అంతర్జాతీయ సమాజానికి తెలుసు. ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటూ మానవహక్కుల గురించి అంతర్జాతీయ సమాజం తరఫున మాట్లాడుతున్నట్లు చూపించుకోవడం పాక్ చేస్తున్న దుస్సాహసమే'' అని ఆయన విమర్శించారు.

సోషల్ మీడియాలోనూ విమర్శలు..

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ విమర్శలు, జోక్‌లు వెల్లువెత్తాయి.

https://twitter.com/freakykalin/status/1172140643608481793

''యూఎన్‌హెచ్‌ఆర్‌సీలోని 47 దేశాల్లో 58 దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు తెలిపాయన్నమాట. పాకిస్తాన్‌లో ప్రతిఒక్కరూ శాస్త్రవేత్తలు అయిపోతున్నట్లు ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీ (పాక్ విదేశాంగ మంత్రి) కొత్తగా 11 దేశాలను కనిపెట్టారు. పాక్ నాయకత్వానికి హ్యాట్సాఫ్'' అని డ లైయింగ్ లామా అన్న పేరుతో ఉన్న ఓ యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/ShiChikkalli/status/1172200845523292160

''ఇప్పుడైతే యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో 47 దేశాలే ఉన్నాయి. మీరు చెప్పిన 58 దేశాల్లో బలూచిస్తాన్, సింధుదేశ్, పస్తునిస్తాన్ కూడా ఉన్నాయా?'' అని శివ అనే ఓ యూజర్ ఇమ్రాన్‌ను ప్రశ్నించారు.

https://twitter.com/dr_rita39/status/1172111738038345728

''మీ దగ్గర ఆ దేశాల జాబితా ఉందా? ఆ పేర్లన్నీ వెల్లడిస్తారా?'' అని రీటా పాల్ అనే మహిళ పాకిస్తాన్ ప్రధానిని అడిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)