తిరుమల వెంకటేశ్వరుడి ఆస్తులను టీటీడీ అమ్మకానికి పెట్టిందని ఈనాడు కథనం ప్రచురించింది. స్వామివారిపై భక్తి ప్రపత్తులతో దాతలు విరాళాలుగా సమర్పించుకున్న ఆస్తులు ఇప్పుడు ‘నిరర్థకం’ అయిపోయాయంటూ వాటిని అమ్మేందుకు సిద్ధమవుతోందని రాసింది.

ఈ ఆస్తుల పర్యవేక్షణ భారంగా మారిందని, వాటిని కాపాడలేక అమ్ముతున్నామన్నది టీటీడీ వాదన.

ఈ కథనం ప్రకారం, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులతో పాటు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరికొన్నింటినీ అమ్మేందుకు టీటీడీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని పలు జిల్లాల్లో 23 చోట్ల ఉన్న ఆస్తుల వేలానికి అధికారులు సిద్ధమయ్యారు.

వీటన్నింటినీ వేలం వేసినా వచ్చే సొమ్ము రూ. 1.54 కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌లో జమచేయాలని నిర్ణయించారు.

టీటీడీ చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, ఓవీ రమణ తిరుపతిలో స్పష్టం చేశారని కథనంలో రాశారు.

ఆస్తులను అమ్ముకోడానికి బదులు ధార్మిక అవసరాలకు వీలుగా మార్చుకోవాలని సూచించారు.

తమిళనాడులో భూముల వేలం ప్రక్రియ పర్యవేక్షించేందుకు తితిదే రెండు బృందాలను నియమించింది.

తితిదేలో నిర్వహణ ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. ధర్మకర్తల మండలి సభ్యుల సూచనల మేరకు వివిధ రాష్ట్రాల్లోని ఆలయాలను టీటీడీ పరిధిలోకి తేవడంతో పాటు పలుచోట్ల కల్యాణ మండపాలు నిర్మిస్తున్నారు.

వీటి నిర్వహణ టీటీడీకి భారంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గడంతో.. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై ఆదాయమూ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దాతలు ఇచ్చిన ఆస్తులను విక్రయించాలని ఫిబ్రవరిలో నిర్వహించిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారని ఈనాడు కథనం తెలిపింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బడ్జెట్‌లో నిరర్ధక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రతిపాదించారని వివరించింది.

జులై 6 నుంచి 9 వరకూ ఆన్‌లైన్‌లో తెలంగాణ ఎంసెట్

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదాపడిన పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసిందని నమస్తే తెలంగాణ సహా ప్రధాన పత్రికలు అన్నీ రాశాయి.

కొవిడ్‌-19 నిబంధనలు అనుసరించి ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ మేరకు జూలైలోనే అన్ని ప్రవేశ పరీక్షలను పూర్తిచేస్తామని చెప్పారు.

పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. టీఎస్‌ఎంసెట్‌-2020ని జూలై 6 నుంచి 9 వరకు నాలుగు రోజులపాటు వరుసగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

తన కార్యాలయంలో శనివారం మంత్రి ఎనిమిది ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ను విడుదలచేశారు.

టీఎస్‌ పీఈసెట్‌ను జూలై 16 తరువాత నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తేదీలను తరువాత ప్రకటించనున్నారు.

కొవిడ్‌-19 నిబంధనలు అమలుచేస్తూ, యూజీసీ సూచనలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి సబిత తెలిపారు.

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌తోపాటు అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగించారు.

ఆన్‌లైన్‌ పరీక్షల కోసం కన్వీనర్‌ నిర్ణయించిన పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ కేంద్రాలలో రెండు పూటలు పరీక్షలు నిర్వహిస్తారు.

కొవిడ్‌-19 నిబంధనలు పాటించాల్సి ఉన్నందున ఎంసెట్‌ పరీక్షను నాలుగు రోజులు నిర్వహించనున్నారు. ఒక్కో రోజు రెండు పూటలా.. ప్రతి పూట 25 వేల చొప్పున రోజుకు 50 వేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రవేశపరీక్షలు పూర్తిచేసిన రెం డు వారాల్లో ఫలితాలు విడుదల చేయడంతోపాటు నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడం కోసం వెంటనే అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేయడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి సారించిందని నమస్తే తెలంగాణ వివరించింది.

డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలి-జగన్

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారని సాక్షి కథనం ప్రచురించింది.

ఎనిమిది జిల్లాల్లోని కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న ఐసోలేషన్, ఆక్సిజన్‌ సదుపాయాలున్న పడకల సంఖ్యను కూడా మరింత పెంచాలన్నారు.

కరోనా వైరస్‌ లక్షణాలుంటే పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.

కనీస జాగ్రత్తలు, వైద్య సహాయంతో కోలుకోవడం సులభం అవుతుందని చెప్పారు. కరోనా సోకడం నేరం, పాపం కాదని.. దానిపట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని, వైరస్‌ ఎవరికైనా వ్యాపిస్తుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారని కథనంలో చెప్పారు.

వైరస్‌ సోకిందని అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్‌ చేయాలి? వైద్య సదుపాయం ఎలా పొందాలన్న దానిపై క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలన్నారు.

ఇందుకోసం డోర్‌ లెవల్‌ రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఫోన్‌ చేయగానే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకునే పరిస్థితి ఉండాలని స్పష్టంచేశారు. హైరిస్క్‌ ఉన్న వారు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా మరణాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రజలకు బాగా తెలియజేయాలని.. ఈ మేరకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన ఆదేశించారని సాక్షి చెప్పింది.

రిస్క్‌ ఉన్న వ్యక్తులు వైద్యం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందనే అంశాన్ని కూడా వివరించాలని జగన్ చెప్పారని కథనంలో రాశారు.

లాక్‌డౌన్ అనంతర చర్యలపై తెలంగాణ ఫోకస్

లాక్‌డౌన్ కట్టడి గడువు ముగుస్తుండడంతో ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ప్రధానంగా ఐదు అంశాలపై ఎక్కవగా ఫోకస్‌ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపింది.

అన్ని వైద్య సంస్థలు సాధారణ సేవలందిస్తూ.. కరోనా చికిత్సకూ సన్నద్ధంగా ఉండాలని, జ్వరం, ఫ్లూ, శ్వాసకోశ సంబంధిత జబ్బుల నిఘాను మరింత పెంచాలని, వలస కార్మికులపై మరింత దృష్టి పెట్టాలని, పట్టణ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్‌ చేయాలని, వృద్ధులు, చిన్నపిల్లలను కాపాడుకోవాలని ఆదేశించింది.

లాక్‌డౌన్‌ తర్వాత సన్నద్ధతను వివరిస్తూ.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దవాఖానాలను సిద్ధం చేయాలని సూచించినట్లు పత్రికలో రాశారు.

జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో వచ్చేవారి కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక వెయిటింగ్‌ రూమ్‌తోపాటు భౌతిక దూరం ఉండేలా చూడాలని, అన్ని పీహెచ్‌సీల్లో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు సంబంధించిన ఫింగర్‌ టిప్‌ పల్స్‌ ఆక్సోమీటర్‌ లభ్యతను పర్యవేక్షించుకోవాలని తెలిపింది.

రోగికి మాస్కు ఉంటేనే ఆస్పత్రి లోపలికి అనుమతించాలని, ఒక్కో పేషెంట్‌ను పరిశీలించిన ప్రతిసారీ స్టెతస్కోప్‌, థర్మామీటర్‌, బీపీ మిషన్‌ను డిస్‌ఇన్‌ఫెక్టర్లతో శుభ్రం చేయాలని ఆదేశించింది.

డాక్టర్లు, సిబ్బంది అంతా మాస్క్‌, గ్లవ్స్‌ ధరించాలని, ఆస్పత్రిలో ప్రతి భాగాన్ని, రోజూ రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌తో శుభ్రం చేయాలని తెలిపింది. అంబులెన్సులు కరోనా అనుమానితుల్ని తీసుకొచ్చిన ప్రతిసారీ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలని పేర్కొన్నట్లు కథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)