మందిరం పరిసరాల్లో భూమి చదును చేస్తున్నప్పుడు పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలు లభించినట్లు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పింది.

కలెక్టర్ అనుమతితో ట్రస్ట్ ఇక్కడ మే 11 నుంచి చదును చేసే పనులు ప్రారంభించింది.

“భూమిని చదును చేస్తున్నప్పుడు చాలా పురాతన అవశేషాలు లభించాయి, ముక్కలైన దేవతల విగ్రహాలు, పుష్ప కలశం, రాతి శిల్పాలు లభించాయి” అని ట్రస్ట్ ఒక ప్రకటనలో చెప్పింది.

“ఇప్పటివరకూ 7 బ్లాక్ టచ్ స్టోన్ స్తంభాలు, 6 రెడ్ శాండ్ స్టోన్ స్తంభాలు, 5 అడుగుల శివలింగం, ఆర్చి రాళ్లు దొరికాయి. చదును చేసే పనులు ఇంకా కొనసాగుతున్నాయి” అని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు.

ఈ పురాతన మందిర అవశేషాలు, అక్కడ రామ మందిరం ఉన్నట్టు ప్రామాణిక ఆధారాలని ట్రస్ట్ చెబుతోంది. రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు రామ్ లల్లాను ప్రతిష్ఠించిన ప్రాంతంలో ప్రస్తుతం భూమి చదును చేసే పనులు జరుగుతున్నాయి.

పనులు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి?

మందిర నిర్మాణం కొనసాగించడానికి వీలుగా, అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ దారి, యాంగిల్స్ లాంటివి తొలగించి ట్రస్ట్ ఆ ప్రాంతమంతా చదును చేస్తోంది.

ఈ పనుల్లో 3 జేసీబీలు, 1 క్రేన్, 2 ట్రాక్టర్లు, 10 మంది కూలీలు ఉన్నారు. కరోనా వల్ల వీరందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూనే పనిచేస్తున్నారని చంపత్ రాయ్ చెప్పారు.

లాక్‌డౌన్ సడలించిన సమయంలో భూమిని చదును చేయడానికి ట్రస్ట్ అనుమతి కోరిందని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ అక్కడ పనులు చేస్తున్నారని అయోధ్య కలెక్టర్ అనుజ్ కుమార్ ఝా చెప్పారు.

అక్కడ లభించిన అవశేషాల గురించి మాట్లడిన ఆయన “ఇప్పటివరకూ దొరికిన అవశేషాలను ట్రస్ట్ పర్యవేక్షణలోనే ఉంచారు. వాటిని శుభ్రం చేశారు. పురాతత్వ వేత్తలు వాటిని ఇంకా పరిశీలించలేదు. అదంత త్వరగా అయ్యే పని కూడా కాదు” అన్నారు.

చదును చేస్తున్న ప్రాంతంలో దొరికిన ఇలాంటి అవశేషాలే ఇంతకు ముందు కూడా లభించినట్లు చెబుతున్నారు.

ఇంతకు ముందు కూడా అవశేషాలు

స్థానిక జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠీ అక్కడ ఇంతకు ముందు కూడా పురాతన అవశేషాలు దొరికాయని చెప్పారు.

“పురాతన ఆలయ అవశేషాలు ఇంతకు ముందు కూడా దొరికాయి. ఇప్పుడు దొరుకుతున్న శివలింగం, కలశం, విగ్రహాలు కూడా దానికి సంబంధించినవే అయ్యుంటాయి. ఎందుకంటే అప్పుడు ఆ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని రామ్ లల్లా విగ్రహం పెట్టారు. అందుకే అప్పట్లో అక్కడ వాటిని సంరక్షించలేకపోయాం. అవే ఇప్పుడు దొరుకుతున్నాయి” అన్నారు.

కానీ, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్, సున్నీ వక్ఫ్ బోర్డ్ వకీలుగా పనిచేసిన జఫర్యాబ్ జిలానీ మాత్రం ఆ అవశేషాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మీడియాతో మాట్లాడిన ఆయన, “ఎఎస్ఐ ఆధారాల ప్రకారం 13వ శతాబ్దంలో అక్కడ ఎలాంటి మందిరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటప్పుడు అవశేషాలు దొరికాయనే మాటలు ప్రచారమే తప్ప, వేరే ఏం కాదు” అన్నారు.

ఇంతకు ముందు కూడా ఆ ప్రాంతంలో పురాతత్వ శాఖ తవ్వకాలు జరిగాయని, వాటిలో మందిర అవశేషాలు లభించాయి అని రామజన్మభూమి ప్రధాన పురోహితుడు ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన “తవ్వకాల్లో లభించిన అవశేషాల ఆధారంగానే సుప్రీంకోర్టు రామ లల్లా తరఫున తీర్పు వినిపించింది. ఇప్పుడు మళ్లీ రామ మందిరానికి సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. వాటిలోని తామర ఆకు, శంఖు-చక్రాలు. ధనుస్సు లాంటి ఆకృతులన్నీ సనాతన హిందూ ధర్మానికి సంబంధించినవే. అవన్నీ ఇక్కడ ఇంతకు ముందే మందిరం ఉందనే విషయాన్ని చెబుతున్నాయి” అన్నారు.

అవశేషాలపై కొత్త వివాదం

మరోవైపు, కొంతమంది మాత్రం తవ్వకాల్లో లభించిన శివలింగం లాంటి అవశేషాలు మందిరానికి సంబంధించినవి కావని, అవి బౌద్ధ మతానికి సంబంధించినవి అని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

ట్విటర్‌లో బౌద్ధస్థల్ అయోధ్య అనే హ్యాష్ ట్యాగ్‌తో జనం తవ్వకాల్లో లభించిన అవశేషాల ఫొటోలను షేర్ చేస్తున్నారు.

గత ఏడాది రామ మందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, స్వాధీనం చేసుకున్న స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ వల్ల రెండు నెలల వరకూ పనులు జరగలేదు. ఇప్పుడు కొంత సడలించడంతో చదును చేసే పనులను ప్రారంభించారు.

దానితోపాటు, అయోధ్యలోని రామ జన్మభూమి న్యాస్ వర్క్ షాపులో చెక్కిన రాళ్లను శుభ్రం చేసే పనులు కూడా మొదలయ్యాయి.

గత ఏడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు ఈ వివాదానికి సంబంధించి 2.77 ఎకరాల భూమిని రామ లల్లా ఆలయానికి అప్పగించింది.

మందిర నిర్మాణం, నిర్వహణ కోస కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే మసీదు నిర్మించుకోడానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఆదేశించింది. దానిని ప్రభుత్వం ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు కేటాయించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)